newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం

31-05-202031-05-2020 09:37:17 IST
Updated On 31-05-2020 11:01:36 ISTUpdated On 31-05-20202020-05-31T04:07:17.607Z31-05-2020 2020-05-31T04:07:09.455Z - 2020-05-31T05:31:36.556Z - 31-05-2020

ధూమపానం మానకపోతే ప్రాణాలకు ప్రమాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనచుట్టూ వున్న వాతావరణం, కాలుష్యానికి తోడు మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నవాటిలో పొగాకు అతి ముఖ్యమైనది. చాలా మంది పొగాకుని ధూమపానంలో వినియోగించడం వల్ల మాత్రమే ఆరోగ్యానికి ముప్పుంటుందని, ఇంకేరకంగా వాడినా సమస్య లేదని అపోహ పడుతుంటారు. ఇది చాలా పొరపాటు. కేవలం సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటిని వాడడమే పొగాకు వినియోగం కాదు. ఖైనీ, గుట్కా. జర్దా, పాన్‌ మసాలా, నశ్యం ఇలా ఏ రకంగా ఉపయోగించినా ఆరోగ్యానికి ప్రమాదం తప్పదు. 

దీనిని వాడే విధానాన్ని బట్టి అది శరీరంలో కొన్ని భాగాల్లోగానీ, కొన్నిసార్లు మొత్తం శరీరమంతా తీవ్రమైన ప్రభావాన్ని చూపించి ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల పొగాకును ఏ రూపంలోనూ వాడకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఈ నెల 31న 'ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం' సందర్భంగా పొగాకు వల్ల శరీరంలోని వివిధ అవయవాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. 

పొగాకు వినియోగం ఒక దుర్వ్యసనం. ఇది చిన్నప్పుడే ఒక సరదాగా మొదలై.. వయసు పెరుగుతున్న కొద్దీ వదిలించుకోలేని వ్యసనంగా మారుతుంది. చివరకు ప్రాణాల్నే హరిస్తుంది. పొగాకు వాడకాన్ని కొంతమంది ధూమపానంగా మొదలు పెడుతుంటే మరికొంతమంది గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటి రూపాల్లో వాడుతుంటారు. ఇంకొంతమంది ఈ రెండు రకాలూ వినియోగిస్తూ... అంటే పొగాకును నోట్లో వేసి నమలడం, పొగని పీల్చి, వదలడమూ చేస్తుంటారు. చివరికి ఈ వ్యసనాలే వారి ఆరోగ్యానికి శాపంగా మారుతున్నాయి. దేశంలో రోజుకు మూడు వేల మంది పొగాకు వల్లే చనిపోతున్నారు. రోజువారీ క్యాన్సర్‌ మరణాల్లో 30 శాతం వరకూ పొగాకు ఉత్పత్తుల వల్లే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

పొగాకును కాల్చి దానిని పొగరూపంలో పీల్చి, వదలడం ఫ్యాషన్‌గా మారింది.సిగరెట్‌, బీడీ, చుట్ట, హుక్కా పీల్చడం ఇలా ఏరూపంలో ఉన్నా అంతిమంగా పొగతాగడమే. దీనివల్ల పొగాకులోని నికోటిన్‌తో టార్‌ (బూడిద), కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రోజన్‌ సైనైడ్‌, అమ్మోనియా, ఫార్మల్డిహైడ్‌, ఆర్సెనిక్‌, డీడీటీ లాంటి హానికర పదార్థాలు శరీరంలోకి తేలిగ్గా చేరతాయి. అంతేకాదు ఒక సిగరెట్‌ పొగలో సుమారు నాలుగువేల రసాయనాలు ఉన్నాయి. అందులో 43 రకాల క్యాన్సర్‌ కారకాలతోపాటు 400 రకాలు విషపూరితమైనవి. సిగరెట్‌ను ఒక్కసారి పీల్చితే 0.25 ఔన్సుల బూడిద విడుదలవుతుంది. అది నేరుగా ఊపిరితిత్తులకు చేరి అక్కడే ఉండిపోతుంది. 

దీనిలో కొంతభాగం ఊపిరితిత్తుల్లోని నాళాలకు అంటుకుంటుంది. సిగరెట్లు ఎక్కువగా తాగేవారి ఊపిరితిత్తుల్లో బూడిద పేరుకుపోయి, నల్లగా తయారవుతాయి. ఊపిరితిత్తుల్లోని కణాలు కణుతులుగా మారి, క్యాన్సర్‌గా రూపుదిద్దుకుంటుంది. ఫిల్టర్‌ సిగరెట్లకన్నా చుట్ట, బీడీ, ఫిల్టర్‌లెస్‌ సిగరెట్లవల్ల ఈ టార్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నదాన్లో వాస్తవం లేదు. స్మోకింగ్‌ ఏరకం సిగరెట్లు, బీడీలు, చుట్టలతో అయినా ఒకే రకమైన దుష్ఫలితాలను ఇస్తుంది.

ధూమపానంతో విడుదలయ్యే కార్బన్‌మోనాక్సైడ్‌ ఊపిరితిత్తుల్లోకి చేరుకుని, రక్తంలో కలుస్తుంది. అక్కడ హీమోగ్లోబిన్‌తో చర్య జరిపి, కార్బాక్సీ హిమోగ్లోబిన్‌గా మారుతుంది. దీంతో శ్వాసక్రియ ద్వారా అందిన ఆక్సిజన్‌ రక్తంలో కలవదు. ఈ చర్యలు నిరంతరాయంగా కొనసాగడం వల్ల కణాలకు ఆక్సిజన్‌ అందక అవయవాలు చలనరహితం అవుతాయి. ఈ పరిస్థితి ప్రాణం పోవడానికి దారి తీస్తుంది.

ధూమపానం వల్ల విడుదలయ్యే మిగిలిన హైడ్రోజన్‌ సైనైడ్‌, అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్‌, ఆర్సెనిక్‌, డీడీటీ లాంటి విషపూరిత రసాయనాల వల్లా క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్మోకింగ్‌ చేసేవారు తమ ప్రాణాల పట్లే కాదు ఇతరుల ప్రాణాల విషయంలోనూ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తాము స్మోకింగ్‌ చేయడమే కాకుండా తమ పక్కన ఈ అలవాటు లేనివారికీ పాసివ్‌ స్మోకింగ్‌ ద్వారా విషాన్ని అందిస్తున్నారు. దీనివలనా చాలామంది శ్వాస సంబంధ అనారోగ్యాలకు గురై, చనిపోతున్నారు.

పొగాకును వివిధ మిశ్రమాలలో కలిపి నమలడమూ శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం గుట్కా, ఖైనీ, పాన్‌ వంటి రూపాల్లో ఎక్కువమంది వీటిని నములుతున్నారు. ఇలా నమలడానికి కారణం పొగాకులో ఉండే నికోటిన్‌. ఇది మెదడును ఉత్తేజపరుస్తుంది. దీంతో ఎసిటైల్‌కోలిన్‌ అనే రసాయనం విడుదలై, నమిలిన వారికి ఎంతో హుషారుగా ఉన్నట్టన్పిస్తుంది.

పొగాకు నమిలితే నికోటిన్‌తో లెడ్‌, క్యాడ్మియం లాంటివి విడుదలవుతాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్‌ (ఆక్సైడ్స్‌, పెరాక్సైడ్స్‌, సూపర్‌ఆక్సైడ్స్‌-హానికరమైనవి) ను పెంచుతాయి. సాధారణంగా ఈ ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొనే శక్తి దేహానికి ఉంటుంది. ఎప్పుడైతే దేహం ఎదుర్కొనే స్థాయి కంటే ఫ్రీ రాడికల్స్‌ ప్రభావం ఎక్కువైపోతే అప్పుడు దుష్ప్రభావాలు మొదలవుతాయి. ఈ హానికరమైన పదార్థాలు పెరగడం వల్ల కణాల్లోని డీఎన్‌ఏ దెబ్బ తింటుంది. దీంతో కణం విపరీతంగా సమ విభజనలు చెంది ఒక కణితి (ట్యూమర్‌) గా రూపాంతరం చెందుతుంది. ఇవే క్యాన్సర్‌ కణాలుగా మారతాయి. పాన్‌ మసాలా, గుట్కా, ఖైనీలు ఎక్కువగా నమిలేవారికి నోరు, గొంతు, పేగు క్యాన్సర్లు వస్తాయి. ఇప్పటివరకు గొంతు క్యాన్సర్ కారణంగా చనిపోయిన వారిలో 80 శాతం మంది పొగాకుని ఏదోరూపంలో వాడినవారే. మరి కొంతమంది పొగాకు పొడిని నశ్యంగా ముక్కు రంధ్రాల ద్వారా ఆస్వాదిస్తుంటారు. ఈ అలవాటూ శ్వాసకోశ క్యాన్సర్‌కు దారితీస్తుంది.

పొగాకు శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపడం ఖాయం. పొగాకు వినియోగించే అలవాటుని అనుసరించి, ఆయా శరీర భాగాలు ప్రభావితమౌతుంటాయి.

గుండె

పొగ తాగే అలవాటు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. దీర్ఘకాలికంగా ఎక్కువ స్థాయిలో రక్తపోటుంటే అది గుండెపోటుకు కారణమే. గుండె పోటు హార్ట్‌ ఫెయిల్యూర్‌కు కారణం కావచ్చు. పొగతాగే అలవాటున్న వారికి ఆటలు ఆడడం, వ్యాయామం, బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసం వస్తుంది. వీరి గుండె పనితీరు నెమ్మదిగా క్షీణిస్తుంది. పొగతాగే అలవాటు లేకపోయినా పరోక్ష ధూమపానం వల్లా కొంతమందికి ఈ సమస్యలు తప్పడం లేదు.

మెదడు

ధూమపానం వల్ల పొగాకులోని ముఖ్యపదార్థం నికోటిన్‌ నేరుగా మెదడుకు చేరుతుంది. ఇది మొదట్లో మెదడును ఉత్తేజ పరిచినట్టుగా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా రక్తపోటును పెంచుతుంది. తర్వాత గుండె వేగం మీద దీని ప్రభావం పడుతుంది. దీర్ఘకాలంగా పొగతాగడానికి అలవాటుపడిన వారు ఆందోళన, డిప్రెషన్‌, అభద్రతా భావంలో ఉంటారు.

ఊపిరితిత్తులు

ధూమపానం చేసేవారిలో ఎక్కువమంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వల్లే చనిపోతున్నారు. వీరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా, ఇతర శ్వాస సంబంధమైన అలర్జీలతో బాధపడుతున్న వారికి ఈ అలవాటు మరింత ప్రాణాంతకంగా మారుతుంది. కఫంతో కూడిన తీవ్రమైన దగ్గు తరచూ పీడిస్తుంది. ఒక్కోసారి లంగ్‌ ఫెయిల్యూర్‌కూ ధూమపానమే కారణమౌతుంది.

కళ్లు

పొగాకు వాడకం వల్ల కళ్ల ఆరోగ్యం వేగంగా పాడవుతుంది. పొగాకులోని నికోటిన్‌ వయసుతో సంబంధం లేకుండా కాటరాక్ట్‌, గ్లకోమా వంటి సమస్యలని తీసుకొస్తుంది. ఇవి క్రమంగా పూర్తి అంథత్వానికి కారణమవుతాయి. డయాబెటిస్‌ సమస్య ఉన్న వారికి పొగ తాగే అలవాటు ఉంటే.. డయాబెటిక్‌ రెటినోపతి కచ్ఛితంగా వస్తుంది. పొగతాగే సమయంలో పీల్చివదిలే పొగ ముఖాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీంతో కళ్లు పొడిబారిపోతాయి.

నోరు

పొగాకు వాడకం ముందుగా నోటిని, దాన్లోని దంతాలు, చిగుళ్లు, నాలుక, ఇతర భాగాలను దెబ్బతీస్తుంది. పొగతాగేవారు, పొగాకు నమిలేవారు అనే మినహాయింపులు ఏమీ లేకుండానే నోటి ఆరోగ్యం నాశనమౌతుంది. ఇది నోటిలో ఉండే సున్నితమైన మ్యూకస్‌ పొరల్లోనే సమస్యని తీసుకొస్తుంది. నోటిలో అల్సర్లు రావడంతో మొదలై, అది క్రమంగా క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. చాలాసార్లు నోటి క్యాన్సర్లను గుర్తించడంలో జాప్యం జరగడం వల్ల ప్రమాదకరంగా మారతాయి. పెదవులు, నాలుక, నోటి దిగువ భాగం, సైనస్‌, గొంతుభాగాల్లో క్యాన్సర్‌ రావడానికి ప్రధానకారణం పొగాకు వినియోగమే. పొగాకు వల్ల దంతాల రంగు మారి, వేగంగా పాడౌతాయి. నాలుక మీద ఉండే రుచిమొగ్గలు పొగాకు ప్రభావంతో దెబ్బతింటాయి.. ఫలితంగా రుచులను గుర్తించలేరు. పొగాకు వాడకంతో చిగుళ్ల వ్యాధులు కూడా వస్తాయి. చిగుళ్ళ నుంచి రక్తం రావడం, నోటి దుర్వాసనకూ పొగాకు వ్యసనమే చాలావరకూ కారణం.

మూత్రాశయం

పొగతాగే అలవాటు వలన మూత్రాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికంగా పొగ తాగేవారికి ప్రాణాంతక మూత్రాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. వీరిలో 6-9 ప్రోటీన్లలో మార్పులు తలెత్తుతున్నాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో ప్రోటీన్లలో మార్పులు జరుగుతున్నకొద్దీ క్యాన్సర్‌ చికిత్సల వల్ల ఫలితం ఉండదు. దానివల్ల పొగతాగే అలవాటున్న మూత్రాశయ క్యాన్సర్‌ రోగులే ఎక్కువశాతం చనిపోతున్నారు.

మూత్రపిండాలు

పొగాకును ఎక్కువగా వాడేవారిలో మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. పొగాకు నేరుగా రక్తపోటుపై ప్రభావం చూపిస్తుండడమే దీనికి కారణం. స్మోకింగ్‌ అలవాటున్నవారికి బీపీని అదుపు చేయడానికి వేసుకునే మందులూ సరిగా పనిచేయవు. ఎక్కువకాలం అదుపులో లేని బీపీ మూత్రపిండాల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది. ఇది క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌కూ ముఖ్య కారణమౌతుంది.

లైంగిక జీవితంపై ప్రభావం 

పొగాకు వాడకం లైంగిక జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. పురుషులలో ఇది అంగస్తంభన సమస్యలకు కారణమవుతుంది. స్త్రీలలో లైంగికాసక్తిని తగ్గిస్తుంది. స్త్రీలలో పొగాకు వాడే అలవాటు ఉన్నవారిలో సంతాన సాఫల్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు గర్భస్రావాలకు ఇది కారణమౌతోంది. పొగతాగే మహిళల్లో ఎక్టోపిక్‌ ప్రెగెన్సీ (ఫాలోపియన్‌ ట్యూబుల్లో పిండం రూపు దిద్దుకోవడం) వంటి సమస్యలు వస్తుంటాయి.

చర్మం

పొగతాగే వారు, పొగాకుని వాడేవారి చర్మం వయసుతో సంబంధం లేకుండా వేగంగా ముడతలు పడుతుంది. సహజంగా సాగే గుణాన్ని చర్మం కోల్పోతుంది. కళ్ల కింద తిత్తులు ఏర్పడుతాయి. వీరికి శరీరంపై ఎక్కడైనా గాయాలు అయితే మానడం ఆలస్యమవుతుంది. చర్మ క్యాన్సర్‌ రావొచ్చు. చర్మం నుంచి దుర్వాసనా వస్తుంది.

స్మోకింగ్‌ మాన్పించే వ్యాక్సిన్ ‌

జీవితంలో ఒక్కసారి అలవాటైతే చివరివరకూ వదలని దురలవాటు ధూమపానం. దీన్ని మానిపించడానికి ఇప్పుడు నికోటిన్‌ ప్యాచ్‌లూ గమ్‌లూ చాలా రకాలున్నాయి. గతేడాది వైద్య పరిశోధనల్లో 'నిక్‌వాక్స్‌' అనే టీకానూ కనుగొన్నారు. సాధారణంగా సిగరెట్‌ తాగినప్పుడు శరీరంలోకి ప్రవేశించే నికోటిన్‌ మెదడుకు చేరుతుంది. క్రమంగా మెదడు ఆ నికోటిన్‌కి బానిసవుతుంది. ఈ టీకా వేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ నికోటిన్‌ను వ్యతిరేకించే యాంటీబాడీలను తయారుచేస్తుంది. నికోటిన్‌ శరీరంలోకి ప్రవేశించగానే ఈ యాంటీబాడీలు అప్రమత్తమై ఆ రేణువులకు అతుక్కుపోయి, వాటిని మెదడుకు చేరకుండా చేస్తాయి. దాంతో సిగరెట్‌ తాగడం వల్ల కలిగే ఆనందం స్మోకర్స్‌కు కలగదు. ఒక్కో సిగరెట్‌ తాగే విరామ సమయమూ క్రమంగా పెరుగుతూ వచ్చి, చివరకు మానేస్తారు. పొగతాగే అలవాటుకు చెక్‌చెప్పే ఈ వ్యాక్సిన్‌ ఇంకా అందరికీ అందుబాటులోకి రావాల్సి ఉంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle